చలపతి రావు మృతి పట్ల మెగా బ్రదర్స్ స్పందన

సీనియర్ నటుడు చలపతి రావు మృతి పట్ల మెగా బ్రదర్స్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు స్పందించారు. చలపతిరావు మరణ వార్త తనను కలిచివేసిందని చిరంజీవి అన్నారు. విలక్షణమైన నటుడు, తనదైన శైలితో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న శ్రీ చలపతిరావు గారి అకాల మరణ వార్త తనను కలిచివేసిందని పేర్కొన్నాడు. ఎన్నో చిత్రాల్లో ఆయనతో కలిసి నటించానని తెలిపాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రవిబాబుకు, ఆయన కుంటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి అని సోషల్‌ మీడియాలో భావేద్వేగపూరిత పోస్ట్‌ చేశాడు.

అలాగే పవన్ కళ్యాణ్ సైతం చలపతి మృతి పట్ల స్పందించారు. ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేశారని చెప్పారు. నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జూ. ఎన్టీఆర్‌..అమెరికాలో ఉండడంతో రవిబాబుకు వీడియో కాల్‌ చేసి, ఆయన్ని చివరి చూపు చూశాడు. అనంతరం రవిబాబుకు ధైర్యం చెప్పాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు.. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో బుధవారం నిర్వహించనున్నారు. ఆయన కూతురు అమెరికాలో ఉంటుండంతో ఆమె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.