గుర్రంపై వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ధర్మశ్రీ

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ఏరియాలోకి గుర్రం ఫై వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని , ఆ ఇంటికి ప్రభుత్వ పధకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని నేతలకు ఆదేశించారు. ఎవరు ఈ కార్యక్రమానికి వెళ్లకపోయినా వచ్చే ఎన్నికల్లో టికెట్స్ ఇవ్వనని తేల్చి చెప్పారు. దీంతో ప్రతి ఒక్క నేత ప్రతి గడప తొక్కుతూ ప్రభుత్వ పధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చాలామందికి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఇంటి ముందు కు వచ్చిన చాలామంది నేతలను ప్రజలు నిలదీయడం చేస్తున్నారు.

తాజాగా అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన నియోజకవర్గంలోని ఏజెన్సీ ఏరియాలలో రోడ్డు మార్గం లేకపోవడంతో నాలుగు కిలోమీటర్ల మేర గుర్రంపై తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోలుగుంట మండలం శివారు ఏజెన్సీ ఆర్ల పంచాయతీకి చెందిన లోసంగి పీతురు గడ్డ, పెద్ద గరువు, గుర్రాల బైల, గడప పాలెం గ్రామాలలో గడపగడపకు కార్యక్రమంలో గుర్రంపై పాల్గొన్నారు. అక్కడ ప్రజలు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే వారికి త్వరలో కొండపై కూడా రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.