ఇండోనేషియాలోని ఫుట్‌బాల్ స్టేడియం కూల్చివేత: అధ్యక్షుడు జోకో విడోడో

Indonesia to demolish football stadium where crush killed 133: President

జకార్తా: ఇండోనేషియాలోని కంజురుహాన్ ఫుట్ బాల్ స్టేడియాన్ని కూల్చివేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో ఓ ప్రకటన చేశారు. ఈ స్టేడియాన్ని కూల్చివేసి, అన్ని భద్రతా ప్రమాణాలతో పునర్నిర్మిస్తామని వెల్లడించారు. దాంతో పాటు దేశంలో ఫుట్‌బాల్‌ను సంస్కరించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్‌ఫాంటినో హామీ ఇచ్చారు. అయితే ఈ దేశంలోనే వచ్చే ఏడాది అండర్-20 ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్ జరగనుంది.

కాగా, అక్టోబర్ 1న తూర్పు జావా ప్రావిన్స్‌లోని కంజురుహాన్‌ ఫుట్‌బాల్‌ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 133 మంది మృతి చెందారు. ఆ రోజును.. ఫుట్‌బాల్‌ క్రీడా చరిత్రలో చీకటి రోజుల్లో ఒకటిగా ఇన్‌ఫాంటినో ప్రకటించారు. ప్రస్తుతం ఇండోనేషియాలోనే ఉన్న ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య ప్రతినిధులు.. ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. విచారణ ప్రక్రియ పూర్తయ్యే వరకు దేశంలోని అన్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు దేశాధ్యక్షుడు విడోడో ఇప్పటికే ప్రకటించారు.