ఆ ప్రాంతంలో భూములు ఉంటే అవి వారికే రాసిస్తా

నీరుకొండలో ఐదెకరాలు ఉన్నట్లు నిరుపిస్తే ఎమ్మెలే పదవికి రాజీనామా చేస్తా

alla ramakrishna reddy
alla ramakrishna reddy

అమరావతి: రాజధాని ప్రాంతంలో భూములు కొన్న వైఎస్‌ఆర్‌సిపి నేతలు వీరే అంటూ టిడిపి నేతలు ఒక జాబితాను విడుదల చేశారు. దీనిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కూడా ఉంది. దీనిపై స్పందించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి రాజధాని ప్రాంతంలో తనకు భూములు ఉన్నట్లు నిరూపిస్తే అవి వారికే రాసిచ్చేస్తానని సవాల్‌ విసిరారు. టిడిపి ఆరోపిస్తున్నట్లు నీరుకొండలో ఐదెకరాలు ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఆయన ఛాలెంజ్‌ విసిరారు. ఇంకా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. ఈ నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని పేరిట అక్రమాలకు పాల్పడింది చంద్రబాబు నాయుడే అని ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి నేతలు ఇన్సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలతో సహా నిరూపించామన్నారు. దళితుల భూములను కాజేసిన చంద్రబాబు నాయుడు వాటిని బినామీలకు కట్టబెట్టారని ఆర్కే ఆరోపించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/