వైస్సార్సీపీ కాపు నేతలతో ముద్రగడ పద్మనాభం భేటీ..

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర భేటీ జరిగింది. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీలన్నీ తమ తమ ప్రణాళికల్లో ఉన్నాయి. ఈ తరుణంలో అధికార పార్టీ కాపు నేతలతో ముద్రగడ పద్మనాభం సమావేశం కావడం వార్తల్లో హైలైట్ అవుతుంది.

కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లిన నేతలు ఆయనతో అల్పాహార విందు సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పలువురు ఎంపీపీలు, కాపు నేతలు వీరిలో ఉన్నారు. ఈ విందు రాజకీయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వీరు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

ముద్రగడ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. కాపు రిజర్వేషన్ ఉద్యమ సమయంలో తునిలో రైలుకు నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించిన కేసులతో ముద్రగడ బాగా ఇబ్బంది పడ్డారు. అయితే, వైస్సార్సీపీ ప్రభుత్వం ఇటీవలే ఆ కేసులన్నింటినీ ఎత్తివేసింది. ఈ క్రమంలో వైస్సార్సీపీ కాపు నేతలు ముద్రగడతో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది.