వైస్సార్సీపీ నుండి నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం..

జూన్ 10 న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ నుండి వైస్సార్సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార వైకాపా ఖాతాలో మరో మూడు స్థానాలు జతకానున్నాయి. అయితే ఎన్నికల కమిషన్‌ వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఏకగ్రీవంగా ఎన్నికయినవారిలో వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్‌ రావు, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య ఉన్నారు. కాగా నామినేషన్ల గడువు చివరిరోజు మే నెల 31వ తేదీ మ.3 గంటల వరకు వైకాపా అభ్యర్థులు తప్ప వేరేవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. అయితే వైస్సార్సీపీ అభ్యర్థులు వేసిన నామినేషన్లను బుధవారం పరిశీలించారు.

వైస్సార్సీపీ పార్టీ తరపున నలుగురు సభ్యులు రాజ్యసభకు ఎన్నిక కావడం తో రాజ్యసభలో వైస్సార్సీపీ బలం 9 కి చేరింది. దీంతో రాజ్యసభలో బీజేపీ కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ డీఎంకే తర్వాత ఐదో పెద్ద పార్టీగా నిలవనుంది. ప్రస్తుతం ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన విజయసాయిరెడ్డి బీజేపీకి చెందిన సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ల పదవీకాలం పూర్తవుతున్న విషయం తెలిసిందే. వీరి స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్, రావు నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ప్రతిపక్ష పార్టీలేవీ పోటీలో లేకపోవడమే ఇందుకు కారణం. నిజానికి ఏపీ అసెంబ్లీలో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కావాల్సిన 44 మంది ఎమ్మెల్యేల బలం ప్రతిపక్ష పార్టీల్లో దేనికీ లేదు. దీంతో వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు నామినేషన్లు వేసిన నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.