తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత

రేపు (జూన్ 02) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం ఒక చారిత్రాత్మక ఘట్టమని, ప్రజలంతా ముక్తకంఠంతో కోరి సాధించుకున్న ఒక అపురూప విజయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ విజయం కోసం ఎంతోమంది ప్రాణాలు ధారబోశారని, మరెందరో తమ జీవితాలను అర్పించారని, వారి త్యాగాల ఫలమే నేటి మన తెలంగాణ రాష్ట్రమని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా తన పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన వీరులకు వందనాలు తెలుపుతున్నానన్నారు. ఉద్యమాలకు పురిటిగడ్డ తెలంగాణ అని, పాలకుల అణిచివేత, దాష్టీకాలను ఎదిరించే లక్షణం ఈ నేల సొంతమని, ఈ లక్షణం దేశంలోని ప్రజలందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. పోరాడితేనే లక్ష్యం సిద్ధిస్తుందని ఎలుగెత్తి చాటింది తెలంగాణ ఉద్యమమని కొనియాడారు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఏ లక్ష్యంతో తెలంగాణ కోరుకున్నారో ఆ లక్ష్యం సంపూర్ణంగా సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

ఇక రేపు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ర్ట అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు. సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులర్పిస్తారని తెలిపారు. ఆ తర్వాత పబ్లిక్ కాంగ్రెస్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి.. పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారని చెప్పారు. సాయంత్రం రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం ఉంటుందని చెప్పారు. 2 సంవత్సరాలపాటు కరోనా వల్ల ఘనంగా నిర్వహించక పోయినా ప్రభుత్వం ఈసారి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోపక్క రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతకాలానికి తొలిసారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఢిల్లీ వేదికగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారిస్తున్నట్లుగా తాజా పరిణామాలతో కనిపిస్తుంది.