ఏపీలో రిపబ్లిక్ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న వైసీపీ నేతలు

సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ చిత్రం ఈరోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఏపీలో మాత్రం రిపబ్లిక్ సినిమా ప్రదర్శనను వైసీపీ నేతలు , కార్యకర్తలు అడ్డుకున్నారు. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం ఫై , నేతల ఫై పలు విమర్శలు చేసారు. ఈ విమర్శల పట్ల గత పది రోజులుగా వైసీపీ నేతలు పవన్ ఫై మండిపడుతూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు నేతలంతా పవన్ కళ్యాణ్ ఫై విరుచుకుపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు రిపబ్లిక్ విడుదల అవ్వగా..శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రిపబ్లిక్ సినిమాను వైసిపి నాయకులు అడ్డుకున్నారు.

సినిమా చూసేందుకు వచ్చిన జనాలను కూడా వెనక్కి పంపించేశారు. జగన్ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ సినిమా థియేటర్ ఎదుట ధర్నా చేశారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ నేతలు , కార్యకర్తలు సినిమా ప్రదర్శనను అడ్డుకుంటున్నారు. చిత్రసీమ మాత్రం సినిమాను సినిమాలాగే చూడాలని రాజకీయాలతో ముడిపెట్టకూడదని చెపుతుంది. పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా నిర్మాతల మండలి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. పవన్ వ్యాఖ్యలకు చిత్రసీమ కు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ వైసీపీ నేతలు సినిమాను అడ్డుకుంటున్నారు.