బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. మరో 15 మంది మంత్రుల రాజీనామా

boris johnson
boris johnson

లండన్ : బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన మంత్రుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆ పదవి నుంచి జాన్సన్‌ వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఇద్దరు కేబినెట్‌ మంత్రులు రాజీనామా చేయగా బుధవారం మరో 15 మంది మంత్రులు వారితో జత కలిశారు. దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. బుధవారం నాటికి ప్రభుత్వాన్ని వీడిన వారందరి సంఖ్య 37కి చేరింది.

అయితే, విపక్షంతో పాటు స్వపక్షం నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా ప్రధాన మంత్రి పదవిని వదిలేది లేదని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు. ఒకవైపున ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం, ఇంకో వైపున రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశం పెనుసవాళ్లను ఎదుర్కొంటోందని, ఇటువంటి తరుణంలో ప్రజలు అప్పగించిన బాధ్యతల నుంచి పారిపోయేది లేదని తేల్చి చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌, ఆర్థికశాఖ మంత్రి రిషి సునాక్‌ మంగళవారం నిమిషాల వ్యవధిలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం కూడా ఆ పరంపర కొనసాగింది.

కాగా, దుష్ప్రవర్తన ఆరోపణలున్న క్రిస్‌ పించర్‌ వ్యవహారం తెలిసినా కీలక పదవిలో నియమించడంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న ప్రధాని బోరిస్‌ జాన్సన్‌…బుధవారం పార్లమెంటులోని ప్రతినిధుల సభలో జరిగిన ప్రశ్నావళి కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న మంత్రులు, స్వపక్ష, విపక్ష ఎంపీల డిమాండ్‌ను తోసిపుచ్చారు. దేశ, అంతర్జాతీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/