మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. ఆర్జేడీ నేత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

లిప్‌స్టిక్ పెట్టుకున్న ఆడ‌వాళ్ల‌కు రిజ‌ర్వేష‌న్ అవ‌స‌ర‌మా?

women-with-lipstick-would-exploit-the-womens-reservation-bill-said-rjd-leader-abdul-bari-siddiqui

న్యూఢిల్లీ: ఆర్జేడీ సీనియ‌ర్ నేత అబ్దుల్ బారి సిద్ధి కీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఉద్దేశిస్తూ.. లిప్‌స్ట‌క్ పెట్టుకునే మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని ఆయ‌న విమ‌ర్శించారు. లిప్‌స్టిక్ పెట్టుకుని, బేబీ క‌టింగ్ హెయిర్ స్ట‌యిల్ తో ఉండే ఆడ‌వాళ్లు .. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు పేరుతో హంగామా చేస్తుంటార‌ని ఆర్జేడీ నేత అబ్దుల్ బారి అన్నారు. బీహార్‌లోని ముజాఫ‌ర్‌పుర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ సిద్దికీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌లే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు పార్ల‌మెంట్‌లో పాసైన విష‌యం తెలిసిందే.

రిజ‌ర్వేష‌న్ల‌ను వెనుక‌బ‌డిన వ‌ర్గాల మ‌హిళ‌ల‌కు ఇవ్వాల‌ని, లిప్‌స్టిక్ పెట్టుకుని వ‌చ్చే ఆడ‌వాళ్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అబ్దుల్ బారీ అన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌లు అయిపోయే వ‌ర‌కు టీవీ, సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని కూడా ఆ నేత త‌మ మ‌ద్ద‌తుదారుల్ని కోరారు. త‌మ వాటా కోసం జ‌నం పోరాటం చేయాల‌ని అన్నారు. మ‌న పూర్వీకులు అన్యాయం జ‌రిగింద‌న్న విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాల‌ని, మ‌న పిల్ల‌ల్ని విద్యావంతుల‌ను చేసి, మ‌న వాటా కోసం మ‌నం పోరాడాల‌ని ఆర్జేడీ నేత తెలిపారు.