పునర్వివాహ ప్రోత్సాహక పథకం..2 లక్షలు.. ప్రకటించిన ఝార్ఖండ్ ప్రభుత్వం

widow remarriage incentive scheme launched in Jharkhand

న్యూఢిల్లీః దేశంలోనే తొలిసారి ఝార్ఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో వితంత పునర్వివాహ ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకున్న మహిళలకు ప్రభుత్వం రూ. 2 లక్షల ప్రోత్సాహకం అందిస్తుంది. అయితే, లబ్ధిదారులు వివాహ వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తించదు. ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు లబ్దిదారు పునర్వివాహ తేదీ నుంచి ఏడాది లోపు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటు దివంగత భర్త మరణ ధ్రువీకరణ పత్రం జతచేయాల్సి ఉంటుంది.

జీవిత భాగస్వామి మరణించిన తర్వాత మహిళలు సమాజంలో ఒంటరిగా, నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, వారు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని అధికారి ఒకరు తెలిపారు. అలాంటి పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందన్నారు. వితంతువుల్లో ఈ పథకం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని, మహిళల పునర్వివాహం పట్ల సామాజిక అభిప్రాయాన్ని మారుస్తుందని పేర్కొన్నారు.