క్లీనర్లుగా, వెయిటర్లుగా మారడానికి ఇష్టపడుతున్న చైనా యువత!

తక్కువ వేతనం వచ్చినప్పటికీ ఎక్కువ సంతృప్తి, పనిలో ఆనందం ఉందంటున్న యువత

Why Chinese Youth Is Leaving White-collar Jobs To Become Cleaners, Waiters

బీజింగ్‌ః చైనాలో చాలామంది యువత కొత్తగా ఆలోచిస్తున్నారట! లక్షలు వచ్చే జీతానికి బదులు సంతోషాన్ని కోరుకుంటున్నారు. అందుకే వైట్ కాలర్ ఉద్యోగాలు వదిలేసి వెయిటర్స్, చెఫ్స్, క్లీనర్స్, క్యాషియర్స్ వంటి బ్లూకాలర్ జాబ్స్ లోకి మారిపోతున్నారట. ఈ మేరకు జోరుగా వార్తలు వస్తున్నాయి. మై ఫస్ట్ ఫిజికల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ జియోహోంగ్షులో వైట్ కాలర్ ఉద్యోగాలు వదిలేసిన వారు తమ అనుభవాన్ని పంచుకుంటున్నారు. ఈ ఉద్యోగాల్లో తక్కువ వేతనం వచ్చినప్పటికీ ఎక్కువ సంతృప్తి, పనిలో ఆనందం ఉన్నాయని చెబుతున్నారు.

టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ లో పనిచేసిన ఓ యువతి తాను కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో కుక్ గా పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఎనలేని ఆనందాన్ని పొందుతున్నానని పేర్కొన్నారు. రోజుకు తాను దాదాపు 140 డాలర్లు (భారత కరెన్సీలో రూ.11,000) సంపాదిస్తున్నానని, కానీ ఇప్పుడు తన శరీరం అలసిపోయినప్పటికీ మానసిక ప్రశాంతత పొందుతున్నట్లు పేర్కొంది.

మరో మహిళ కన్సల్టింగ్ ఉద్యోగాన్ని వదిలి, కాఫీ షాప్ లో పని చేస్తున్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఫలితం కోసం తాను ఇంతకాలం పని చేశానని, దీంతో తనలో ఓ రకమైన శూన్యత ఏర్పడిందని, మనల్ని భాగస్వాములను చేసే శారీరక శ్రమ తనలో కొత్త శక్తిని ఇస్తోందని పేర్కొన్నారు. ఈ పని సరదాగా ఉందని పేర్కొన్నారు. ఉద్యోగం సమయంలో తాను విరామం లేని ఇంటర్వ్యూలూ, ఈమెయిల్స్, పీపీటీలతో విసిగిపోయినట్లు తెలిపారు. సంస్థలు ఉద్యోగం కోసం కాకుండా యాంత్రికంగా పని చేయించడం కోసం తీసుకుంటున్నాయని చాలామంది యువత నిరాశలో ఉన్నారని న్యూయార్క్ యూనివర్సిటీ షాంఘైలో సోషియాలజీ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.