అమృత్‍పాల్ సింగ్ భార్యను విచారించిన పంజాబ్‌ పోలీసులు

Who is Amritpal Singh’s NRI wife Kirandeep, questioned by cops over foreign funds

చండీగఢ్‌ః ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే ’ చీఫ్ అమృత్‍పాల్ సింగ్ కోసం గత ఆరు రోజులుగా పంజాబ్‌ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. పోలీసులు క‌న్నుగ‌ప్పి ప‌రారీలో ఉన్న ఆ వేర్పాటువాద నేత మారువేషాల్లో తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమృత్‌ పాల్‌ సింగ్‌ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం అమృత్‌పాల్‌ స్వగ్రామమైన జల్లుపూర్‌ ఖేరా కు వెళ్లిన పోలీసులు ఆయన తల్లిదండ్రులు, భార్యను విచారించారు. అమృత్‌పాల్‌ భార్య కిరణ్‌దీప్ కౌర్ , అమృత్‌పాల్ తండ్రి తార్సెమ్ సింగ్, తల్లిని మహిళా పోలీసు అధికారులు దాదాపు గంటపాటు విచారించారు. అమృత్‌పాల్ కార్యకలాపాలకు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణలపై కిరణ్‌దీప్‌కౌర్‌ ను పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది.

కాగా, గ‌త శ‌నివారం నుంచి అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్న విష‌యం తెలిసిందే. మారువేషాల్లో అత‌ను త‌ప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అత‌నితో లింకు ఉన్న మ‌ద్దతుదారుల్ని కొంద‌ర్ని ఇప్పటికే అరెస్టు చేశారు. వార్సీ పంజాబ్ దే కార్యక‌ర్తల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కొంద‌ర్ని అస్సాంలోని దిబ్రుఘ‌ర్‌లో ఉన్న జైలుకు త‌ర‌లించారు.