మునుగోడు ఫస్ట్ ఫలితం ఏ టైంకు వస్తుందంటే..

What time will the munugode first result come?

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరగబోతుంది. దేశ వ్యాప్తంగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం కౌంటింగ్ కు సంబదించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. నల్లగొండ టౌన్‌లోని అర్జాల‌బావి దగ్గర వేర్ హౌసింగ్ గోడౌన్‌లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ప్రక్రియలో 21 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు సూప‌ర్‌వైజ‌ర్, అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్, మైక్రో అబ్జర్వర్‌ల‌ను నియ‌మించారు. మొత్తం 298 పోలింగ్‌ బూత్‌ల్లోని ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను 15 రౌండ్లలలో లెక్కిస్తారు.

ఉదయం 9 గంటలకల్లా తొలి ఫలితం వెల్లడయ్యే ఛాన్స్‌ ఉంది. చివరి ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చే అవకాశం ఉంది. మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వ‌చ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంల‌లో న‌మోదైన ఓట్లను లెక్కిస్తారు. మొదట చౌటుప్పల్‌ మండలంలోని ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాల ఈవీఎంలను టేబుళ్ల వద్దకు తరలించనున్నారు. ఇదిలా ఉంటె గెలుపు ఫై టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ రికార్డుస్థాయిలో నమోదైంది. మొదట 92 శాతం పోలింగ్‌ నమోదైందని అధికారులు ప్రకటించారు. ఐతే కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం వంటి కారణాలతో గురువారం రాత్రి పొద్దుపోయేవరకు సాగిన పోలింగ్‌ ప్రకారం మొత్తం 93.13 శాతం నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. మరి ఈ ఉప ఎన్నిక బరిలో ఎవరు గెలుస్తారో చూడాలి.