నారాయ‌ణ అరెస్ట్‌పై చిత్తూరు జిల్లా ఎస్పీ ఏమన్నారంటే..

టెన్త్ పేపర్ లీకేజ్ విషయంలో మాజీ మంత్రి నారాయణ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నారాయణ అరెస్ట్ ఫై చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మీడియా తో స్పందించారు. ప్రశ్నాపత్రం లీకేజ్‌ కేసులో పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు. గత నెల 27న టెన్త్‌ పేపర్‌ లీక్, మాల్‌ ప్రాక్టీస్‌ జరిగిందని.. డీఈవో ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, చిత్తూరు వన్‌టౌన్‌ పీఎస్‌లో నారాయణపై కేసు నమోదైందని తెలిపారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల వాంగ్మూలం, వారు ఇచ్చిన ఆధారాలను పోలీసులు సేకరించిన ఆధారాలతో నారాయణ పాత్ర ఉందని స్పష్టంగా తేలిందన్నారు.

హైద‌రాబాద్‌లో ఈరోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఆయ‌న‌ను అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. అనంత‌రం ఆయ‌న‌ను చిత్తూరు త‌ర‌లిస్తున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌పై న‌మోదు చేసిన కేసుల వివ‌రాల‌ను చిత్తూరు పోలీసులు వెల్ల‌డించారు. ప‌బ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్ష‌న్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చ‌ట్టం కింద, ఐపీసీ సెక్ష‌న్లు 408,409, 201,120(బీ),తో పాటు 65 ఐటీ చ‌ట్టం కింద ఆయనపై కేసు న‌మోదు చేసినట్లు తెలిపారు. ఇక ప‌బ్లిక్ ఎగ్జామ్ చ‌ట్టంలోని సెక్ష‌న్లు 5, 8, 10 కింద కూడా నారాయ‌ణ‌పై కేసులు న‌మోదు చేసినట్లు తెలిపారు.

నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్‌ లీక్‌ చేశారని తేలిందన్నారు. ముందుగానే టెన్త్ పరీక్షల ఇన్విజిలేటర్ల వివరాలు తీసుకున్నారని.. వీరి దగ్గర చదివే విద్యార్థులను రెండు విభాగాలుగా విభజిస్తారని చెప్పుకొచ్చారు. ముందే ఏ విద్యార్థులు ఎక్కడ పరీక్ష రాస్తారో తెలుసుకుని.. హెడ్‌ ఆఫీస్‌ నుంచి వెంటనే కీ తయారు చేసి విద్యార్థులకు పంపుతారని వివరించారు. అరెస్టైన వారంతా 2008 నుంచి నారాయణ విద్యా సంస్థల్లో పని చేసిన వారే ఉన్నారని ఎస్పీ తెలిపారు.