నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా…ప్రభుత్వ హెచ్చరిక

Water Wastage Fine.. Delhi Acts Tough To Tackle Capital Crisis

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి కొరత నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ జల బోర్డును ఆదేశించింది. దీంతో కార్లు కడుగడం వంటివి చేస్తే రూ.2,000 జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఎవరైనా నీటిని వృథా చేస్తే వారికి చలానా విధిస్తామని ప్రకటించారు. కార్లు, ఇతర వాహనాలను కడుగడం, నిర్మాణ, వాణిజ్య ప్రయోజనాల కోసం గృహ సరఫరా నీటిని వినియోగించడాన్ని అనుమతించబోమని పేర్కొన్నారు.

200 బృందాలను జల బోర్డు మోహరించనున్నది. ఉదయం 8 గంటల నుంచి ఈ బృందాలు దేశ రాజధాని ప్రాంతాల్లో తిరిగి నీటి వృథాపై దృష్టిసారిస్తాయి. అలాగే నిర్మాణ స్థలాలు, వాణిజ్య సంస్థల్లో ఉన్న అక్రమ నీటి కనెక్షన్‌లను నిలిపివేయాలని జల బోర్డు అధికారులను మంత్రి అతిషి ఆదేశించారు. తీవ్ర ఎండలతోపాటు హర్యానా నుంచి నీటి సరఫరా ఆగిపోవడం కూడా నీటి కొరతకు కారణమని అన్నారు.