కన్యత్వ పరీక్షలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కన్యత్వ పరీక్ష.. మహిళల గౌరవానికి భంగం కలిగించడమే.. ఢిల్లీ హైకోర్టు

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీః కన్యత్వ పరీక్షలపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలకు కచ్చితమైన శాస్త్రీయ, వైద్యపరమైన నిర్వచనమే లేదని పేర్కొంది. అయినప్పటికీ ఈ పరీక్ష మహిళల స్వచ్ఛతకు చిహ్నంగా మారిందని తెలిపింది. మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహించడం అమానుషమని, సుప్రీంకోర్టు కూడా ఈ పరీక్షలకు శాస్త్రీయత లేదని చెప్పిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ఈమేరకు 1992లో క్రైస్తవ సన్యాసిని (నన్) మృతి కేసు విచారణలో భాగంగా తనకు కన్యత్వ పరీక్షలు నిర్వహించారంటూ సెఫీ అనే మరో నన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘మహిళా నిందితులకు కన్యత్వ పరీక్షలు చేయడం దర్యాప్తులో భాగం కాబోదు, కస్టడీలో ఉన్న నిందితులకు కన్యత్వ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమే. ఇది రాజ్యంగంలోని ఆర్టికల్ 21 ను ఉల్లంఘనే’ అని ధర్మాసనం పేర్కొంది. కస్టోడియల్ డిగ్నిటీ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మహిళలు గౌరవంగా జీవించే హక్కుకు భంగం కలిగేలా ఎవరు ప్రవర్తించినా రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది.