సినిమా టికెట్ ధరల పెంపు పై కేసీఆర్ సర్కార్ ఫై విజయ్ దేవరకొండ హర్షం

ఏపీలో సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గిస్తే..తెలంగాణ లో మాత్రం సినిమా టికెట్ ధరలను అమాంతం పెంచేసింది కేసీఆర్ సర్కార్. ఈ క్రమంలో చిత్రసీమ ఏపీ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతూ..కేసీఆర్ సర్కార్ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు కేసీఆర్ ఫై ప్రశంసల జల్లు కురిపించగా..తాజాగా యంగ్ విజయ్ దేవరకొండ తెలంగాణ సర్కార్ ఫై తమ ప్రేమను , అభిమానాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

తెలంగాణలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోని అతి పెద్ద పరిశ్రమలలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకటని పేర్కొన్న విజయ్… చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్ కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని విజయ్ దేవరకొండ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్ లు రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని వీడీ కొనియాడారు. తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని పేర్కొన్న విజయ్.. సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.

ఇక తెలంగాణ లో పెరిగిన టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. ఎ.సి థియేటర్స్‌లో టికెట్‌ కనీస ధర రూ.50 + జీఎస్‌టీ, నాన్‌ ఎ.సి. 30+ జీఎస్‌టీ, మల్టీప్లెక్స్‌ అయితే రూ.100 +జీఎస్‌టీ ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎ.సి థియేటర్స్‌లో గరిష్ఠ ధర రూ.100 + జీఎస్‌టీ, నాన్‌ ఎ.సి. 70+ జీఎస్‌టీ, సింగిల్‌ థియేటర్‌ రిక్లైనర్‌ సీట్‌: 200+జీఎస్‌టీ, బిగ్‌ స్కీన్‌ అయితే రూ.250 +జీఎస్‌టీ, మల్టీప్లెక్స్‌ 250 +జీఎస్‌టీ, రిక్లైనర్‌ 300+జీఎస్‌టీ చెల్లించాల్సిందింగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.