ప్రాథమిక స్థాయి నుంచి విద్యాబోధన మాతృభాషలోనే జరగాలి

మాతృభాష వినియోగంపై మాట్లాడిన వెంకయ్యనాయుడు

తిరుపతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు తిరుపతి ఐఐటీ 6వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాతృభాషపై తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని అభిలషించారు. దేశంలోని అన్ని ప్రధాన సాహిత్యాలు, వైద్య, ఇంజినీరింగ్ పరిశోధన గ్రంథాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తే వాటి ఫలితాలు అందరికీ అందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరిపాలన స్థానిక ప్రజల వాడుక భాషలోనే జరగాలని అన్నారు. కోర్టుల్లో జరిగే వాదోపవాదాలు కూడా మాతృభాషలోనే జరగాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

పూర్వీకులు అందించిన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించే బాధ్యత విద్యార్థులపైనే ఉందని, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. మాతృభాషను, తల్లిదండ్రులను, మాతృదేశాన్ని, విద్యను అభ్యసించిన సంస్థను, చదువు నేర్పిన గురువులను మర్చిపోరాదని తెలిపారు. ఇక, తిరుపతి ఐఐటీ గురించి మాట్లాడుతూ, ఆరేళ్ల కిందట తానే ఈ విద్యాసంస్థకు శంకుస్థాపన చేశానని, కొన్నేళ్లలోనే అభివృద్ధి పథంలో పయనిస్తుండడం సంతోషం కలిగిస్తోందని తెలిపారు.

తాజా తెలంగాణ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/