బడులు ఇంకా ఎంత ‘దూరం’?

విద్యాసంవత్సరం రద్దు అని ప్రకటించాలి

School children
School children

ఈ సారి విద్యా సంవత్సరం ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతోంది. ఒకవైపు కేంద్రం అనుమతి ఇచ్చినా బడుల నిర్వహణ, నిర్ణయం రాష్ట్రాల ఇష్టాయిష్టాలకే వదిలేసింది.

ఈ దిశలో భారత్‌లోని రాష్ట్రాలు బడుల విషయంలో విశుద్ధ ప్రకటనలు చేస్తున్నాయి. నవంబర్‌ రెండు వరకు వద్దని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

కరోనా వైరస్‌ తగ్గిన తర్వాతనే అని హర్యానా, మేఘాలయ ప్రకటించాయి.దీపావళి తరువాతే అని గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

ఈనెల ఆఖరి వరకు అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవ్ఞలు అని కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్ప ప్రకటించారు. అసొంలో నవంబర్‌ 1న ప్రారంభించాలని ప్రకటించారు.

ఈ విధంగా రాష్ట్రాలు ప్రక టనలు చేస్తున్నాయి. కానీ ఒక వేళ పాఠశాలలు తెరిస్తే ఆ పిల్లల బాధ్యత, ఆరోగ్యం ఎవరు భుజాలకెత్తుకుంటారు అని ఆలోచిస్తున్నారు.

ప్రతి పాఠశాలలో భౌతిక దూరం పాటించాలి, శానిటైజ్‌ చేయాలి. మాస్క్‌లు ధరించాలి. ఇది తలకు మించిన భారం.

ఇవన్నీ ఎదుర్కొని పాఠశాలలు తెరచినా వచ్చేది ఎంత మంది అని ప్రశ్నించుకుంటే జవాబులేని ప్రశ్నగా మిగులుతుంది.

ప్రభుత్వాలు అదిగో..ఇదిగో పాఠశాలలు ప్రారంభిస్తామని చెబితే చాలదు. ముందు పిల్లల తల్లిదండ్రులు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ తల్లిదం డ్రులు తమ పిల్లలను బడులకు పంపడానికి సుముఖంగా లేరు. ఒక విద్యాసంవత్సరం వృధా అయినాసరే మాకు పిల్లల ఆరోగ్య మే ముఖ్యం అనే మిషతో ఉన్నారు.

ఇవన్నీ తెలిసే ఒడిశా ప్రభుత్వం విస్పష్ట ప్రకటన చేయక ఏకంగా విద్యాసంవత్సరం రద్దు చేసింది.

ఈ సంవత్సరం ‘శూన్య సంవత్సరంగా ప్రకటిం చింది. ఆ రాష్ట్రంలో 2021లో కొత్త విద్యాసంవత్సరం మొదలవు తుంది.

ఒడిశా ప్రభుత్వం ప్రకటన స్వాగతించ దగ్గదే. ఎందు కంటే ప్రతి నెల వివిధ రాష్ట్రాలు అదిగో ఇదిగో పాఠశాలలు ప్రారంభిస్తామని ప్రకటనలు చేస్తూ పిల్లలను ఆందోళనకు గురి చేస్తున్నారు.

కనుక ఒక సంవత్సరం వృధా అయినా పోయేది ఏమిలేదు.

ఒకవేళ పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే కరోనా వైరస్‌ పూర్తిగా తగ్గుముఖం పడితే అప్పుడు స్పష్టమైన, సహేతుకమైన ప్రకటన చేసి విద్యాసంవత్సరం కొనసాగించాలి.

ఆ నిర్ణయమే పిల్లలకు, తల్లిదండ్రులకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. అంతే కాని నెల,నెల రేపో మాపో పాఠశాలలు అని విద్యార్థులను ఆందోళనకు గురి చేయరాదు.

ఈ విషయంలో విద్యాసంవత్సరం రద్దు చేయడం సాహసోపేతమైన నిర్ణయం. దీనికి అక్కడి తల్లిదండ్రులు నుంచి పూర్తి మద్దతు లభించింది.

ఇక ఆన్‌లైన్‌ తరగతులు ప్రవేశపెట్టినా దీనివలన ఎంత మంది లబ్ధిపొందుతు న్నారో తెలియని పరిస్థితి. అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాల్లోఆన్‌లైన్‌ తరగతుల వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు.

కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు అత్యుత్సాహంతో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడం కేవలం ప్రచారానికి మాత్రమే పనికి వస్తుంది.ఆన్‌లైన్‌ తరగతులు జరిగితే భారత్‌ అంతటా జరగాలి.

కొన్ని చోట్ల జరిగి, కొన్ని చోట్ల జరగకపోవడం విచారకరం. ఏదో మా పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులు వింటున్నారని గర్వంగా చెప్పుకోవడానికి తప్పా ఎటువంటి ప్రయోజనం ఉండదు.

పై పెచ్చు మా పిల్లవాడు ఆన్‌లైన్‌ క్లాస్‌ వింటున్నాడు అని తల్లి దండ్రులు చెప్పడం విచిత్రంగా ఉంది. మిగతా వారికి లేని విద్య వీరికెందుకు? అందరూ ఆన్‌లైన్‌ వినే స్థోమత ఉండదు.

ఏ కొద్ది మందికి మాత్రమే ఆన్‌లైన్‌ క్లాసులు కానీ, దేశమంతటా జరగడం లేదు. ముందు దీన్ని కట్టడి చేయాలి. పాఠశాలలకు వచ్చి పాఠాలు వింటేనే విద్యార్థులకు అవగాహన ఉంటుంది.

అంతే తప్ప ఆన్‌లైన్‌ వలన ఒరిగేది ఏమీలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్ని రాష్ట్రాలకు ఈ విద్యా సంవత్సరం రద్దు చేయాలి అని ప్రకటించాలి.

  • కనుమ ఎల్లారెడ్డి

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/