ఆఫ్‌లైన్ కోచింగ్‌ వైపు ‘వేదాంతు’ అడుగులు

రాబోయే రెండేళ్లలో పదికి పైగా సెంటర్లు
వేదాంతు సహ వ్యవస్థాపకుడు, సీఈవో వంశీ కృష్ణ

Vedantu to start offline coaching centers in ap, telangana

హైదరాబాద్ : రాబోయే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పదికి పైగా సెంటర్లతో ఆఫ్‌లైన్ కోచింగ్‌ ప్రారంభించనున్నట్లు వేదాంతు సహ వ్యవస్థాపకుడు, సీఈవో వంశీ కృష్ణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరవై ఏళ్లుగా భారతీయ విద్యా రంగాన్ని మార్చడంలో వేదాంతు కీలక పాత్ర పోషించిందన్నారు. విస్తరణలో భాగంగా విజ్ఞాన్ తో‌ భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నారు. ‌ఈ లెర్నింగ్ సెంటర్ల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో దశాబ్దాల ఆవిష్కరణల సహాయంతో విద్యార్థులకు వ్యక్తిగత విద్యను అందించడమే లక్ష్యమన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో కూడిన ఈ లెర్నింగ్ సెంటర్లు ద్వారా నాణ్యమైన బోధనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్యార్థుల సందేహాలు పరిష్కరించడానికి అకడమిక్ మెంటర్లు, రియల్-టైమ్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్ టెక్నాలజీ, 24/7 సందేహ నివృత్తి ఉంటుందన్నారు.‌ విద్య అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి విద్యార్థి ఒత్తిడి లేకుండా అభ్యసించే అవకాశం ఉండాలన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జన్మించానని తెలిపారు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానన్నారు. ఈ నేపథ్యంతో‌ వచ్చి ఎడ్‌టెక్‌లో అగ్రగామిగా ఎదగడం గర్వంగా ఉందన్నారు. తొమ్మిదవ తరగతి వరకు ఐఐటీల గురించి తెలియదని, అయినా, ఐఐటీ బాంబే నుంచి పట్టభద్రుడయ్యానని చెప్పారు. ఐఐటీలో ప్రొఫెసర్లు, బ్యాచ్‌మేట్స్ ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. బర్నాలా (పంజాబ్)లో ఒక చిన్న పాఠశాలకు వెళ్లడంతో జీవితం మారిపోయిందన్నారు. మెట్రోపాలిటన్ ప్రాంతాలతో పోలిస్తే ఈ చిన్న పట్టణాల విద్యార్థులు విద్యలో ఎదుర్కొంటున్న అంతరాన్ని గ్రహించానని పేర్కొన్నారు.

‌‌‌ తెలివితేటలు ఉన్న అవకాశాలు దరి చేరని పరిస్థితి అన్నారు. ఎందుకంటే, అందుబాటులో ఉన్న అవకాశాలు తెలియదని చెప్పారు. ఆ అనుభవంతో పాటియాలాలోని ఒక చిన్న పట్టణంలో బోధించడం ప్రారంభించానని తెలిపారు. మొదటి బ్యాచ్‌లోని 33 మంది విద్యార్థులలో 11 మంది ఐఐటీలకు ఎంపికయ్యారన్నారు.‌‌ ఈ విజయం విద్యార్థుల జీవితాలను మార్చడంలో సఫలమైందన్నారు. నాణ్యమైన విద్య విద్యార్థులపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో దీనితో అర్థమైందన్నారు. దేశంలో 2,000 మందికి పైగా నిష్ణాతులైన ఉపాధ్యాయులతో వేదాంతు నడుస్తుందని తెలిపారు. ఆఫ్‌లైన్ కోచింగ్‌తో ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ వైపు నడిపిస్తున్నందున.. ఈ ప్రయాణంలో చేరమని విద్యార్థులను, తల్లిదండ్రులను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. కోచింగ్‌లో ఈ కొత్త శకం విద్యార్థులు గరిష్ట సామర్థ్యాన్ని సాధించడానికి వీలు కల్పించే విధంగా అభ్యాస ఫలితాలు అందిస్తున్నట్లు తెలిపారు. ‌