చార్‌ధామ్ భక్తుల రోజువారీ పరిమితి తొలగింపు: హైకోర్టు
uttarakhand-hc-removes-daily-limit-of-char-dham-yatra
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు చార్ ధామ్ సందర్శించే భక్తుల రోజువారీ పరిమితిని తొలగిస్తూ మంగళవారం ఆదేశాలిచ్చింది. చార్ ధామ్‌కు వచ్చే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని తొలగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన కొన్ని రోజులకు..ఈ మేరకు హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. జస్టిస్ ఆర్‌సీ ఖుల్బే, జస్టిస్ అలోక్ కుమార్ డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం దాఖలు చేసిన సవరణ దరఖాస్తులో.. యాత్రాదారులపై రోజువారీ పరిమితిని ఎత్తివేయాలని కోరింది. భక్తుల సంఖ్యపై పరిమితి ఉండటంలో చిన్నాచితకా వ్యాపారాలు చేసుకుంటున్న వారి సంపాదనపై ప్రభావం చూపుతున్నదని తన పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొన్నది.
కాగా, చార్ ధామ్ యాత్రపై నిషేధాన్ని హైకోర్టు గత నెలలో ఎత్తివేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీ పరిమితిని విధించింది. కోర్టు ఆదేశాల మేరకు కేదార్‌నాథ్ ధామ్‌లో 800, బద్రీనాథ్ ధామ్‌లో 1200, గంగోత్రిలో 600, యమునోత్రిలో 400 మంది యాత్రికులను అనుమతించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/