వైస్సార్సీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి

kapu ramachandra reddy resigned anantapur party president post

వైస్సార్సీపీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి. అనంతపురం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్ష పదవికి రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. వైస్సార్సీపీ పార్టీ పదవులను వీడుతున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రీసెంట్ గా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రామచంద్రా రెడ్డి సైతం రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

జగన్ కు రాసిన లేఖలో తన రాజీనామాకు గల కారణాలను రామచంద్రారెడ్డి వివరించారు. రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కూతురు భర్త ఆత్మహత్యతో రామచంద్రారెడ్డి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఈ క్రమంలో అటు నియోజకవర్గంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం తనకు కష్టంగా మారిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంపై దృష్టి సారించాల్సి ఉన్నందున పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను తాను పర్యవేక్షించలేనని, ఆ పదవిని మరో నేతకు అప్పగించాలని ఆయన జగన్ ను కోరారు.

తనకు అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ఈ వరకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, తనకు అన్ని విధాలా సహాయం చేసి అండగా నిలిచిన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పినట్లు తెలిపారు.