పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి

పార్లమెంట్‌కు చేరుకున్న బడ్జెట్‌ ప్రతులు

Union Finance Minister Nirmala Sitharaman reached Parliament

న్యూఢిల్లీః కాసేపట్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 6వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె సమం చేయనున్నారు. కాసేపటి క్రితం ఆమె రాష్ట్రపతి భవన్ నుంచి బయల్దేరి పార్లమెంటుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతులు ఇప్పటికే పార్లమెంట్‌కు చేరుకున్నాయి. వాటిని సభ్యులకు అందజేయనున్నారు. ఈసారి ఆమె పేపర్ బడ్జెట్ ను కాకుండా… డిజిటల్ ట్యాబ్లెట్ ద్వారా బడ్జెట్ ప్రసంగాన్ని ఇవ్వనున్నారు.

రాజ్ భవన్ కు వెళ్లక ముందు ఆమె తన ఆర్థిక శాఖ కార్యాలయం ముందు తన బృందంతో కలిసి ఫొటొలు దిగారు. 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. జులైలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది.

పేరుకు ఇది మధ్యంతర బడ్జెట్ మాత్రమే అయినప్పటికీ… కీలక పాలసీలకు సంబంధించిన మార్పులు బడ్జెట్ లో ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, భారీ ప్రకటనలు కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆదాయపు పన్నుకు సంబంధించిన ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు ఉండొచ్చని ట్యాక్స్ పేయర్స్ ఆశతో ఉన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా బడ్జెట్ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. రెగ్యులేటరీ ప్రొసీజర్స్ ను సరళతరం చేస్తారని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా, లోన్లు ఈజీగా లభించేలా చర్యలు తీసుకుంటారనే ఆశాభావంలో ఉన్నాయి.