పార్టీ మారడం ఫై తుమ్మల క్లారిటీ

సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరాస పార్టీను వీడుతున్నారని వార్తలు గత కొద్దీ రోజులుగా మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. 2014లో టీడీపీ నుంచి ఖమ్మం బరిలో నిలిచిన తుమ్మల ఆ ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాతి కాలంలో టీడీపీ నుంచి తుమ్మల,కాంగ్రెస్ నుంచి అజయ్ కుమార్ టీఆర్ఎస్‌లో చేరారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నేతలందరినీ కేసీఆర్ తమ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ క్రమంలో తుమ్మలకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కట్టబెట్టారు. 2016లో పాలేరు అసెంబ్లీ ఉపఎన్నికలో తుమ్మల గెలుపొందారు. కానీ ఆ తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుండి తుమ్మల ఎక్కడ కనిపించడం లేదు. పార్టీ సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారు. మరోపక్క మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు ఖమ్మంలో హావ చూపిస్తుండడంతో పార్టీ సైతం తుమ్మలను పట్టించుకోవడం లేదని అందుకే తుమ్మల తెరాస పార్టీ ని విడుతున్నారనే వార్తలు ప్రచారం అవ్వడం మొదలయ్యాయి. చాలామంది ఈ వార్తలు చూసి నిజమే అనుకోవడం స్టార్ట్ చేసారు. ఈ తరుణంలో పార్టీ మారడం ఫై తుమ్మల క్లారిటీ ఇచ్చారు.

నేలకొండపల్లి మండలం చెన్నారంలో ఆయన మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నాననంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారం తప్పని ఆయన స్పష్టం చేస్తూ.. టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలో చేపట్టాల్సిన కొన్ని ప్రాజెక్టులు సాధ్యం కాలేదన్నారు. కేసీఆర్ పిలుపుతో టీఆర్‌ఎస్‌లో చేరి జిల్లాకు భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. కేసీఆర్ సహకారంతో వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చినట్లు తుమ్మల పేర్కొన్నారు. తనను నమ్మి సీఎం జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయించారని, కాబట్టి ధర్మం కోసం.. ఇచ్చిన మాట కోసం కేసీఆర్‌తోనే ఉంటానని తుమ్మల స్పష్టం చేశారు.