సంబరాలు చేసుకుంటున్న TSRTC ఉద్యోగులు

TSRTC ఉద్యోగుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నట్లు సోమవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ ఫోటో కు పాలాభిషేకం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, తమను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలంటూ 2019 సమ్మె సందర్భంగా కార్మికులు డిమాండ్‌ చేశారు. వారికిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు.

ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు. వారికి లభిస్తున్న వేతనాలు, పెన్షన్‌, వసతులు ఆర్టీసీ కార్మికులకు కూడా అందుతాయి. సమ్మెలు, ధర్నాలు చేయాల్సిన అవసరముండదు. ఆర్టీసీ కార్మిక సంఘం ఇకపై ఆర్టీసీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌గా మారుతుందని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ చెపుతున్నారు.

మరోపక్క హైదరాబాద్ నగరవాసులు కూడా ఆనందంతో ఉన్నారు. హైదరాబాద్‌ మెట్రో విస్తరణకు రూ.69,100 కోట్లతో భారీ ప్రణాళికను రాష్ట్ర మంత్రివర్గం ప్రకటించింది. దేశంలో తొలిసారి డబుల్‌ డెక్కర్‌ మెట్రో మార్గాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించింది. మరో వందేండ్లల్లో నగర విస్తరణను దృష్టిలో పెట్టుకుని మెట్రోను ఔటర్‌ అవతలివైపు వరకూ విస్తరించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

ప్రస్తుతం నగరంలో ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోకి అదనంగా 31 కిలోమీటర్లు ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ రూపంలో అందుబాటులోకి రాబోతున్నది. దీనితోపాటు జూబ్లీ బస్టాండ్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో (ఒక లెవల్‌లో వాహనాలు, మరో లెవల్‌లో మెట్రో) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ ఓఆర్‌ఆర్‌ వరకు మరో రూట్‌లో (ఆదిలాబాద్‌ -నాగపూర్‌ రూట్‌లో) డబుల్‌ డెక్కర్‌ ప్లెఓవర్‌ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది నగరవాసులకు ఎంతో తికపై కబురు అనే చెప్పాలి. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మెట్రో పెంచడం ఎంతో ఉపయోగపడుతుంది.