మరికొన్ని గంటల్లో టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్-1 పోస్టుల దరఖాస్తుల గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. మొత్తం 503 పోస్టులకు ఇప్పటి వరకు 2.62 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగిసేసరికి వీటి సంఖ్య 3 లక్షల వరకు చేరుకునే అవకాశాలున్నాయని TSPSC వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడు 312 పోస్టులకు గానూ 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు.

ఈరోజు లాస్ట్ డేట్ కావడంతో అభ్యర్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తుకు పోటెత్తుత్తున్నారు. ఇప్పటి వరకు రోజుకు సగటున 10వేల దరఖాస్తులు వస్తే…సోమవారం ఒక్కరోజే 32 వేల అప్లికేషన్లు రావడం విశేషం. దరఖాస్తు చేసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్‌ చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం కావాలని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు నుంచి కమిషన్ కు విన్నపాలు వస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1కు సంబంధించి మార్కెట్లో మెటీరియల్ సిద్ధంగా లేకపోవడం, తెలుగు అకాడమీలో పుస్తకాల కొరత వేధిస్తుండటంతో సన్నద్ధం అయ్యేందుకు కనీసం 3 నెలలైనా సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు.

మే 2వ తేదీ నుంచి TSPSC Group 1 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. గ్రూప్‌-1 యూనిఫాం పోస్టులైన డీఎస్పీ, డీఎస్‌జే, ఏఈఎస్‌ పోస్టుల గరిష్ఠ వయోపరిమితి, శారీరక దారుఢ్య పరీక్షల అర్హతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. యూపీఎస్సీ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని.. అభ్యర్థుల డిమాండ్‌ మేరకు అర్హతలను ఖరారు చేసింది.