ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ ముట్టడి.. గవర్నర్ కీలక ట్వీట్

కార్మికుల హక్కులను అన్యాయం జరగకూడదనేదే తన ఉద్దేశమని వ్యాఖ్య

ts-governor-tamilisai-tweet-on-rtc-workers-protest

హైదరాబాద్‌ః టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోదించని సంగతి తెలిసిందే. దీంతో రాజ్ భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు బయల్దేరు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రస్తుతం తమిళిపై పుదుచ్చేరిలో ఉన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో తమిళిసై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగడం తనను బాధించిందని ఆమె ట్వీట్ చేశారు. కార్మికులకు తాను వ్యతిరేకిని కాదని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళన కార్యక్రమాలతో సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని అన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన సమయంలో కూడా తాను వారికి అండగా నిలిచానని చెప్పారు. తాను ఎప్పుడూ కార్మికులకు అండగానే ఉంటానని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును ప్రస్తుతం తాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని… ఆర్టీసీ కార్మికుల హక్కులకు ఏమాత్రం అన్యాయం జరగకూడదనేదే తన భావన అని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడాలనేదే తన ఉద్దేశమని తెలిపారు. దీంతో పాటు 2019లో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఓ పత్రికలో వచ్చిన వార్తను కూడా ఆమె షేర్ చేశారు.