దేశాధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడు..ఒబామా
ట్రంప్ వల్ల అమెరికా ప్రతిష్ట మంటకలుస్తోంది

అమెరికా: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడని ఒబామా అన్నారు. అధ్యక్ష బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో ఆయనకు తెలియదని చెప్పారు. ట్రంప్ తీరుతో అమెరికా ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యుఎస్ అధ్యక్ష పదవికి జో బైడెన్ సరైన అభ్యర్థి అని చెప్పారు. ఉపాధ్యక్ష పదవికి కమలా హ్యారిస్ తగిన వ్యక్తి అని కితాబిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని వీరిద్దరూ కాపాడుతారని చెప్పారు. దేశాధ్యక్ష పదవికి ట్రంప్ న్యాయం చేస్తారని భావించామని… కానీ, పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ట్రంప్ విధానాలు, నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాల్లో అమెరికా ప్రతిష్ట దెబ్బతింటోందని… దేశ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని అన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా తనకు లభించిన అత్యున్నత అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ట్రంప్ కు అర్థం కాలేదని ఒబామా దుయ్యబట్టారు. ట్రంప్ వల్ల ఆయనకు, ఆయన స్నేహితులకు తప్ప ఇతరులెవరికీ ప్రయోజనం లేదని అన్నారు. అధ్యక్ష పదవిని కూడా ట్రంప్ ఒక రియాల్టీ షో మాదిరే భావిస్తున్నారని ధ్వజమెత్తారు. ట్రంప్ తప్పుడు నిర్ణయాల వల్ల కరోనాతో 1,70,000 అమెరికన్లు ప్రాణాలను కోల్పోయారని…. లక్షలాది మంది ప్రజలు ఉద్యోగాలను కోల్పోయారని మండిపడ్డారు. స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా దేశ ప్రజాస్వామ్య విలువలను మంటకలిపారని విమర్శించారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/