ఉత్తరాఖండ్ లో విషాదం..ట్రెక్కింగ్ కు వెళ్లిన 12 మంది మృతి

మంచు చరియలు విరిగిపడడంతో ఘటన

ఉత్తరాఖండ్: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వాటి వల్ల వచ్చిన వరదలకు దేవభూమి ఉత్తరాఖండ్ కుదేలైపోతోంది. తాజాగా మరో విషాదం వెలుగు చూసింది. పర్వతారోహణకు వెళ్లిన 12 మంది మంచు చరియలు విరిగిపడి మరణించారు. ఈ ఘటన హార్సిల్, లంఖాగా పాస్ లో చోటు చేసుకుంది. 11 మంచి చొప్పున సభ్యులున్న రెండు గ్రూపులు.. గల్లంతవడంతో అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. అందులో భాగంగా హార్సిల్ వద్ద ఉన్న ఓ గ్రూప్ లోని ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరిని రక్షించారు. మరో ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. వారి కోసం వెతుకుతున్నారు. మరో గ్రూప్ లోని ఐదుగురి మృత దేహాలను లంఖాగా పాస్ లో స్వాధీనం చేసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు. దీంతో ఉత్తరాఖండ్ లో ఈ మూడు రోజుల్లో వానలు, వరదలకు చనిపోయిన వారి సంఖ్య 68కి పెరిగింది.

మరోవైపు పిండారీ, కాఫ్నీ హిమనీ నదాల వద్ద 65 మంది ట్రెక్కర్లను రాష్ట్ర విపత్తు స్పందన దళం అధికారులు కాపాడారు. అందులో ఆరుగురు విదేశీయులు ఉన్నారు. పిథోడ్ గఢ్ లోని దర్మ లోయ వద్ద మరో 23 మందిని రక్షించారు. వరదల ధాటికి చాలా మంది గల్లంతయ్యారని, ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాల వల్ల కుమావూ రీజియన్ లోనే రూ.2 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు డివిజనల్ కమిషనర్ సుశీల్ కుమార్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.7 వేల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/