మరో ఏడాదిపాటు చక్కెర ఎగుమతిపై నిషేధం: కేంద్ర ప్రభుత్వం

India extends curbs on sugar exports by a year through Oct 2023

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు చక్కెర ఎగుమతిపై నిషేధాన్ని పొడిగించింది. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చక్కెర ధరలను నియంత్రించడంలో భాగంగా ఈ ఏడాది జూన్ 1 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు వరకు ఎగుమతులపై నిషేధం విధించింది. మరో రెండు రోజుల్లో ఈ గడువు ముగుస్తుండటంతో ఆంక్షలను మరో ఏడాదిపాటు పొడిగించింది. 2023 అక్టోబర్‌ వరకు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో దేశంలో చక్కెర ధరలను నియంత్రించవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఈ ఏడాది దేశంలో చెరకు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో 8 మిలియన్‌ టన్నుల చక్కెరను ఎగుమతి చేయవచ్చని ప్రభుత్వం, వ్యాపార వర్గాలు ఈ నెల మొదటివారంలో వెల్లడించాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చక్కెర ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రపంచంలో చక్కెర ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉన్నది. గతకొన్నేండ్లుగా ప్రతి సంవత్సరం దేశం నుంచి చక్కెర ఎగుమతులు పెరుగుతూ వస్తున్నాయి. 2018-19లో 38 లక్షల టన్నులుగా ఉన్న ఎగుమతులు.. 2019-2020 నాటికి అది 59.60 లక్షల టన్నులకు చేరింది. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. ఇండోనేషియా, మలేషియా, దుబాయ్‌, అఫ్ఘానిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌తోపాటు ఆఫ్రికన్‌ దేశాలకు భారత్‌ చక్కెరను ఎగుమతి చేస్తున్నది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/