రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్ష‌లు

రేపు శనివారం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు పోలీసులు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేప‌థ్యంలో తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వ‌జ్రోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో భాగంగా శ‌నివారం ట్యాంక్‌బండ్‌పై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార‌ణంగానే శ‌నివారం ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ విష‌యాన్ని గుర్తుంచుకుని శ‌నివారం ఉద‌యం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాల‌నుకునే వాహ‌న‌దారులు… ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాల‌ని సూచించారు.

ఇక స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం తో రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్స‌వ వ‌జ్రోత్స‌వాల‌ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 1 కోటీ 20 లక్షల గృహాలఫై జాతీయ జెండా రెపరెపలాడుతుంది.