గొర్రెకుంట మృత్యుబావి కేసు..సంజ‌య్‌కు ఉరిశిక్ష

గొర్రెకుంట మృత్యుబావి కేసు..సంజ‌య్‌కు ఉరిశిక్ష
warangal-gorrekunta-murder-case-convict-gets-death-sentence

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో తుదితీర్పు వెల్ల‌డైంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సంజ‌య్ కుమార్ యాద‌వ్‌(24)ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేర‌కు మొద‌టి అద‌న‌పు జిల్లా కోర్టు నిందితుడిపై నేరం రుజువైన‌ట్లు ప్ర‌క‌టించింది. నిందితుడిపై అభియోగాల‌ను ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నిరూపించారు. నిందితుడు సంజ‌య్‌కు కోర్టు ఉరిశిక్ష ఖ‌రారు చేసింది. బీహార్‌కు చెందిన సంజ‌య్ కుమార్ ఈ ఏడాది మే 21న తొమ్మిది మందిని హ‌త్య‌చేసి వరంగల్ శివారులోని గీసుకొండలోని గొర్రెకుంట బావిలో పడేసి జ‌ల‌స‌మాధి చేశాడు.

కాగా పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో వీరంతా అద్దె ఇంట్లో ఉండేవారు. ఇక డిసెంబర్ నుంచి వీరు గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గోనె సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌ కుటుంబం ఉంటోంది. భర్తతో విడిపోయిన మక్సూద్ భార్య చెల్లెలు బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో వారి వద్ద ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గొదాం పక్కనే ఉన్న పైభవనంలో బీహార్‌కి చెందిన శ్రీరాం, శ్యాంలు ఉన్నారు. ఇక నగరంలోని సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో బుస్రాకు వివాహేతర సంబంధం ఉండగా.. ఈ విషయంలో తరచుగా మక్సూద్ ఇంట్లో గొడవలు జ‌రిగాయి. ఇక ఇంటిపై ఉంటున్న శ్రీ రాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేశారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ పథకం ప్రకారం తొమ్మిది మందిని హతమార్చాడు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/