ఒంటరిగా ఫీల్ అవుతున్నా.. మరో ఇద్దరు ఖైదీలను నా సెల్‌లో వేయండి: సత్యేంద్ర జైన్

ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని సూపరింటెండెంట్ పై చర్యలు

Tihar jail superintendent gets notice for shifting 2 inmates to Satyendar Jain’s cell

న్యూఢిల్లీః ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే సత్యేందర్ జైన్ సెల్లోకి మరో ఇద్దరు ఖైదీలను పంపించిన జైలు సూపరింటెండెంట్ షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఉన్నతాధికారుల అనుమతిలేకుండా ఖైదీలను ట్రాన్స్ఫర్ చేయడంపై ఏడో నంబర్ జైలు సూపరింటెండెంట్ నోటీసులు అందుకున్నారు. తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నానని, వైద్యుడి సూచన మేరకు కాలక్షేపం కోసం మరో ఇద్దరు ఖైదీలను తన సెల్ లో ఉంచాలని ఈనెల 11న సత్యంద్ర జైన్ లేఖ రాశారు. ఆయన అభ్యర్థన మేరకు నెం. 7 జైలు సూపరింటెండెంట్ ఇద్దరు ఖైదీలను ఆయన సెల్‌కి మార్చారు.

ఈ విషయం తెలుసుకున్న తీహార్ జైలు ఉన్నతాధికారులు ఇద్దరు ఖైదీలను వెంటనే తిరిగి వారి సెల్‌కు తరలించారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండానే సూపరింటెండెంట్ ఖైదీలను సత్యేంద్ర సెల్ కు తరలించడంతో చర్యలకు ఆదేశించారు. కాగా, గతేడాది మేలో మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఆయన ఆరోగ్య, జైళ్ల శాఖలను నిర్వహించారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆయన మంత్రి వర్గ మాజీ సహచరుడు మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియా కూడా తీహార్ జైలులో ఉన్నారు.