నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి కన్నుమూత

నల్గొండ మాజీ ఎంపీ తుమ్మల దామోదర్ రెడ్డి (85) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. దామోదర్ రెడ్డికి భార్య సులోచన, కొడుకు సుభాష్‌చంద్రారెడ్డి, కుమార్తె ఝాన్సీలక్ష్మీ ఉన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

నల్గొండ జిల్లా పీఏపల్లికి మండలం అజ్మాపురానికి చెందిన దామోదర్‌ రెడ్డి.. 1979లో నల్లగొండ ఎంపీ గా గెలుపొందారు. ఆ తర్వాత 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి రఘురామరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దేవరకొండ ప్రాంతంలోని సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేశారు. మాజీ సీఎంలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, చకిలం శ్రీనివాసరావులకు ఆయన సన్నిహితుడు. దామోదర్ రెడ్డి మృతికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, కొండమల్లెపల్లి సింగిల్‌విండో ఛైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు.