నాగాలాండ్ లో ఘోరం : భద్రతా దళాల కాల్పులు.. 14మంది సాధారణ పౌరులు మృతి

నాగాలాండ్ లో ఘోరం : భద్రతా దళాల కాల్పులు.. 14మంది సాధారణ పౌరులు మృతి

నాగాలాండ్ లో ఘోరం జరిగింది. ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది మృతి చెందారు. శనివారం రాత్రి మోన్‌ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, కాల్పుల ఘటనపై ఆగ్రహంతో భద్రతా బలగాల వాహనాలను ప్రజలు తగులబెట్టారు. శనివారం సాయంత్రం ఓటింగ్‌ ప్రాంతంలో మిలిటెంట్ల కదలికలు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్‌ చేపట్టాయి.

ఈ సందర్భంగా బొగ్గు గనిలో విధులు ముగించుకుని వెళ్తున్న కార్మికులను మిలిటెంట్లుగా భావించిన జవాన్లు.. వారిపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. మృతి చెందిన వారికీ ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని స్థానికులు చెబుతున్నారు. తప్పుడు సమాచారంతో వారిని చంపేశారని ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే, మృతుల సంఖ్యపై కొంత గందరగోళం నెలకొంది. ఆరుగురు చనిపోయారని అధికారులు చెబుతుంటే.. మొత్తం 14 మందిని చంపేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై నాగాలాండ్ సీఎం నైపూ రియో స్పందించారు. ఇది దురదృష్టకర ఘటన అని వ్యాఖ్యానించారు. అమాయక పౌరులను చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.