తాను ఒక కులానికి మాత్రమే ప్రతినిధిని కాదని, ప్రజలందరికీ ప్రతినిధిగా ఉండాలని అనుకుంటున్న – పవన్

తాను ఏ ఒక్క కులానికో ప్రతినిధి కాదని .. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తాను మానవత్వంతో పెరిగానని, జాతీయ భావాలతో పెరిగానని, కాకపోతే సమాజంలో ఏఏ కులాలు వెనుకబడి ఉన్నాయో వాటిని భుజాలమీదికి ఎత్తుకోవాలని కంకణం కట్టుకున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని పవన్ అన్నారు. నేను కాపు నాయకుడిని కాదని, నేను కుల ఫీలింగుతో పెరగలేదు.. మానవత్వంతో పెరిగానని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘ కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తాను. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం. ఈ కాంబినేషన్ ఉంటే ఎవ్వర్నీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదు. రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే.. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. బీసీలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. బీసీలంటేనే ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి లేకుంటే సమాజమే లేదన్నారు.

ఒక బీసీ సదస్సు అంటే అందరు బీసీ నాయకులు వస్తారు కానీ, ఒక బీసీ నాయకుడ్ని ఎన్నికల్లో నిలబెడితే అతడిని మిగతా బీసీలందరూ ఓటేసి ఎందుకు గెలిపించరు? అని ప్రశ్నించారు. పోరాటం చేసేటప్పుడు బీసీ నేతలంతా ఎలా ఒక్క తాటిపైకి వస్తారో, ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు కూడా అలాగే ఐక్యంగా, బలంగా నిలబడితే మీరు ఇక ఎవరినీ అడగాల్సిన అవసరమే ఉండదు అని అన్నారు. అప్పుడు మిమ్మల్ని (బీసీ నేతలు) చూస్తే నేను కూడా భయపడతాను అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. “నేను ఎప్పుడైనా మాట్లాడితే నన్ను బీసీ నాయకుల చేత, కాపుల చేత తిట్టిస్తారు. లేకపోతే దళిత నాయకులతో తిట్టిస్తారు. దీని వెనుక ఓ మహత్తరమైన వ్యూహం ఉంది. మీలో మీరు కొట్టుకు చావండి అనేదే వారి ఉద్దేశం అన్నారు.

అలాగే తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని, దీనిపై బీఆర్ఎస్ పార్టీ స్పందించాలని… వైస్సార్సీపీ, టీడీపీ కూడా స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.