తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..

తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో సిబ్బంది వారిని విద్యార్థులను క్షుణ్నంగా పరిశీలించి అరగంట ముందే లోనికి అనుమతించారు. కొన్ని చోట్ల విద్యార్థులు మాస్క్​ కచ్చితంగా ధరించాలన్న నిబంధన అమలు చేయగా.. మరికొన్ని చోట్ల అదేమి లేకుండానే లోపలికి పంపించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. ఏడాదంతా ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు, ఇష్టంగా పరీక్షలు రాసి, మంచి ఉత్తీర్ణతను సాధించాలని అన్నారు.

మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరుగుతోంది. పదో తరగతి వార్షిక పరీక్షలు కూడా రాయనందున ఇది వారికి తొలి బోర్డు పరీక్ష. 70 శాతం మాత్రమే సిలబస్‌, 50 శాతం వరకు ఛాయిస్‌ ఉండటంతో సగటు విద్యార్థి కూడా ఇంటర్‌ పరీక్షలను బాగానే రాయగలుగుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 24 వరకు కొనసాగనున్నప్పటికీ ఈనెల 19న ప్రధానమైన పరీక్షలు ముగుస్తాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని సబిత తెలిపారు. మొత్తం 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వేసవి దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలను తీసుకున్నామని అన్నారు. 25 వేల 510 మంది ఇన్విజిలేటర్లు… 150 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లు… 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు.