విజయసాయిరెడ్డి ఫై ప్రశంసలు కురిపించిన ఎంపీ రఘురామకృష్ణరాజు

వైస్సార్సీపీ పార్టీ నుండి విజయం సాధించిన ఎంపీ రఘురామకృష్ణరాజు..ఆ తర్వాత సొంత పార్టీ కే వ్యతిరేకమయ్యాడు. నిత్యం వైస్సార్సీపీ పార్టీ ఫై , నేతల ఫై విమర్శలు చేస్తూ ఉండే..రఘురామకృష్ణరాజు.. తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి ఫై ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచారు. శనివారం నందమూరి తారకరత్న మృతి చెందిన సంగతి తెలిసిందే. తారకరత్న భార్య విజసాయిరెడ్డికి దగ్గర బంధువు. దాంతో తారకరత్న మృతి చెందిన నాటి నుంచి విజయసాయి రెడ్డి దగ్గరుండి అన్ని పర్యవేక్షించారు. తారకరత్న భార్య, బిడ్డలను ఓదార్చి.. అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించారు.

ఇక తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించడంతో వారితో మాట్లాడడం చేసారు. ఆఖరకు చంద్రబాబు పక్కన కూర్చొని విజయసాయి రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే దీనిపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై రఘురామ స్పందించారు.

రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘ నందమూరి తారక రత్న చిన్న వయసులోనే మృతి చెందడం విషాదకరం. ఆయన మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. తారకరత్న మృతి నేపథ్యంలో మా పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవర్తించిన తీరు అభినందనీయం. రాజకీయాలు శాశ్వతం కాదు. పెళ్లి, చావు వంటి సందర్భాల్లో ఒకరికి ఒకరు ఎదురుపడినప్పుడు ముఖం తిప్పుకొని వెళ్ళిపోకుండా పలకరించి, పరామర్శించడం అనేది రాజకీయాల్లో మంచి సంప్రదాయం. విజయసాయి రెడ్డి దీన్ని పాటించి.. తన సంస్కారాన్ని చాటుకున్నారు.

తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎంత గౌరవం ఇవ్వాలో విజయసాయిరెడ్డి అంత గౌరవం ఇచ్చారు. విజయసాయిరెడ్డి తన హోదా తగ్గకుండా ప్రవర్తించారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘అయితే దీనిపై కొందరు విమర్శలు చేయడం దురదృష్టకరం. రాజకీయాల్లో పార్టీల పరంగా విభేదాలు ఉండవచ్చు. కానీ ఇలాంటి సందర్భాల్లో కూడా వేర్వేరు పార్టీలు అన్నట్లు ప్రవర్తించకూడదు. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు’’ అంటూ విజయసాయిరెడ్డిపై ప్రశంసలు కురిపించారు.