రైతులకు ‘కరెంట్’ షాక్ ఇచ్చిన తెరాస సర్కార్

telangana govt shock to agriculture farmers

తెలంగాణ సర్కార్ రైతులకు షాక్ ఇచ్చింది. ఉచిత విద్యుత్‌ సరఫరాను ఏడు గంటలకు కుదిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజులో 7గంటలు మాత్రమే త్రీఫేజ్‌ విద్యు త్‌ సరఫరా జరుగుతోంది. ముఖ్యంగా రోజూ రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని తాజాగా ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) క్షేత్రస్థాయి అధికారులకు రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాకు కోత పెడుతుంటారు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌కు కోతలు విధిస్తుండటం గమనార్హం.

కొన్ని గ్రామాల్లో ఇప్పటికే కరెంట్ కోతలు మొదలు కావడం తో రైతులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెలియని కరెంట్ కారణంగా చేతికొచ్చిన పంట కళ్లెదుటే ఎండిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు యాసంగి పంటలన్నీ దాదాపు కోతకు వచ్చాయని, ప్రస్తుతమున్న పంటల్లో చాలావరకు కూరగాయలు, ఇతర మెట్ట పంటలు మాత్రమేనని అధికారులు అంటున్నారు. అందుకే వ్యవసాయ విద్యుత్‌ను 7గంటలకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటున్నారు.