ఏపి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాం..: నారా లోకేశ్

జనం కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామన్న టిడిపి నేత

tdp-mlas-will-attend-assembly-session-says-nara-lokesh

అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో రేపటి (గురువారం) నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం నిర్ణయించింది. గురువారం నుంచి ఈ నెల 27 వరకు జరగనున్న సమావేశాలలో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని తెలిపింది. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు తదనంతర పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంపై బుధవారం పార్టీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంతగా అవమానించినా ప్రజల కోసం భరిద్దామని పార్టీ ఎమ్మెల్యేలకు లోకేశ్ సూచించారు. పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని వదులుకోవద్దని వివరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు పైనా శాసన సభలో పార్టీ గళం వినిపించాలని నిర్ణయించారు. అదే సమయంలో బయట కూడా ఆందోళనలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలను ఆపొద్దని లోకేశ్ చెప్పారు. అసెంబ్లీ లోపలా బయట కూడా నిరసనలు తెలియజేయాలని సూచించారు. మరోవైపు, ఈ అసెంబ్లీ సమావేశాలలో వైఎస్‌ఆర్‌సిపి సర్కారు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా వివిధ బిల్లులపై చర్చ జరగనుంది.