టీడీపీ లోకి చలమలశెట్టి సునీల్..?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసీపీ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓటమి తర్వాత పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు వరుసగా రాజీనామా చేస్తూ వస్తున్నారు. కొంతమంది టీడీపీ లో చేరుతుండగా..మరికొంతమంది కొద్దీ రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత చలమలశెట్టి సునీల్..త్వరలో టిడిపి లో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలి ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేసిన ఆయన కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేతిలో పరాజయం పాలయ్యారు. తాజాగా, ఆయన పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయినట్టు తెలిసింది. టీడీపీలో తనకున్న పరిచయాల ద్వారా పార్టీ అధినేత చంద్రబాబుకు రాయబారం పంపినట్టు సమాచారం. 2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలు కాగా, తాజాగా వైసీపీ తరపున బరిలోకి దిగి కూటమి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.