అసెంబ్లీ నుంచి టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

బాలకృష్ణకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్

tdp-mlas-suspended-from-ap-assembly

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమంటూ శాసనసభలో ఆందోళన చేపట్టిన ఆ పార్టీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని మంత్రి బుగ్గన ఆరోపించారు. అనంతరం 15 మందిని సస్పెండ్‌ చేయాలంటూ స్పీకర్‌ను ఆయన కోరారు. దీంతో 14 మంది టిడిపి సభ్యులు (అచ్చెన్న, బాలకృష్ణ, అశోక్‌, భవాని, బుచ్చయ్యచౌదరి, చినరాజప్ప, గణబాబు, పయ్యావుల, గద్దె రామ్మోహన్‌, నిమ్మల, మంతెన, రవికుమార్‌, సాంబశివరావు, స్వామి), వైఎస్‌ఆర్‌సిపికి చెందిన ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానాన్ని పట్టుబడుతూ ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ఛైర్ వద్దకు వెళ్లి నిసరస వ్యక్తం చేశారు. మంత్రి అంబటి రాంబాబుపై మీసం మెలివేస్తూ, దమ్ముంటే రా అని టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక జారీ చేశారు. సభలో మీసాలు మెలివేయడం, తొడగొట్టడం వంటి రెచ్చగొట్టే పనులను బాలకృష్ణ చేశారని… ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని ఆయనకు తొలి హెచ్చరిక జారీ చేస్తున్నామని చెప్పారు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే సభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.