సూపర్ స్టార్ కృష్ణ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందిః చంద్రబాబు

తెలుగు సినిమాకు సాంకేతికతను అద్దిన సాహస నిర్మాత అంటూ ప్రశంస

tdp-chief-chandrababu-responds-on-super-star-krishna-demise

అమరావతిః సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని కృష్ణ (80) అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం 4.10 గంటలకు కాంటినెంటల్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్పదించారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఆయన ఇక లేరన్న వార్త తనను కలచివేసిందన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్‌గా అభిమానులతో పిలిపించుకున్న ఆయన మరణం సినీ రంగానికి తీరని లోటని అన్నారు. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణను చెప్పుకుంటారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా, విలక్షణ నటుడిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసిందన్నారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన మిగిల్చిందన్నారు. ఈ బాధ నుంచి మహేశ్ బాబు త్వరగా కోలుకునే ధైర్యాన్ని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మరోవైపు ప్రముఖ నటుడు కృష్ణ మృతికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. విభిన్న పాత్రలతో కృష్ణ చేసిన ప్రయోగాలు అద్భుతమని కొనియాడారు. వేగంగా సినిమాలు పూర్తి చేసి ఆయన ఎన్నో రికార్డులు సృష్టించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/