సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు

సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులకు నాంది పలికిన ఆంధ్ర జేమ్స్ బాండ్ మృతితో చిత్రసీమ షాక్ కు గురైంది. గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున మృతి చెందారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 31 మే 1942లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ పెద్దవారు.

కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. కృష్ణ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. అది చూసిన కృష్ణ సినిమాలపై మోజు పెంచుకున్నారు. దీంతో ఆయన సినీ రంగానికి వచ్చేశారు. 1965లో ఆయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి రమేశ్ బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. ఆ తర్వాత విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.