కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ జీవితం ఇక అంతే సంగతి – తలసాని

కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయ జీవితం ఇక అంతే సంగతి అన్నారు టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక హోరు నడుస్తుంది. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని కసరత్తులు చేస్తున్నాయి. ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ సైతం మునుగోడు లో గులాబీ జెండా ఎగురవేయాలని చూస్తుంది. గత కొద్దీ రోజులుగా టిఆర్ఎస్ నేతలంతా కూడా మునుగోడు లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో శనివారం ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి తలసాని నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నిక తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయ జీవితం కనుమరుగేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టి బీజేపీలో చేరి ఎన్నికలకు కారకులైన రాజగోపాల్‌ రెడ్డిని అడుగడుగున ప్రజలు నిలదీస్తున్నా సిగ్గు లేకుండా తిరుగుతున్నాడని విమర్శించారు. గడిచిన ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి మేలు చేసిందో చెప్పకుండా ఓట్లు అడగడం దారుణమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న గొర్రెల పంపిణీ పథకాన్ని బీజేపీ నాయకులు అడ్డుకొని గొల్ల కురుముల పొట్ట కొట్టారని పేర్కొన్నారు.

ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరామరక్ష అని మంత్రి తలసాని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు అడ్డదారులు తొక్కుతున్న బీజేపీ నాయకుల వద్ద కోట్ల రూపాయలు అధికారుల తనిఖీల్లో దొరుకుతున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్ మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారన్నారు. రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో 3000రూపాయల పెన్షన్ ఇస్తాను అనడం సిగ్గుచేటు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు 3వేలు ఇవ్వడం లేదన్నారు. వెయ్యి కోట్ల రూపాయలు ఎలా తెస్తారో…. దుబ్బాక, హుజురాబాద్ లో తెచ్చారా లేదా చెప్పాలన్నారు.