తాడిపత్రి సీఐ ఆత్మహత్య..

తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సిఐ ఆనందరావు ఇంటికి చేరుకొని సంఘటన స్థలంలో ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి పని ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఆనందరావు పెద్ద కూతురు భవ్య మాట్లాడుతూ..కేవలం పని ఒత్తిడితోనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. గతంలో తిరుపతి, కడపలో పనిచేసినా ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదన్నారు. తాడిపత్రిలో వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందని హ్యాండిల్ చేయలేకపోతున్నానంటూ తరచూ తన తండ్రి బాధపడ్డారని భవ్య వెల్లడించారు. సీఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు.

ఆనంద్ రావు మృతికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతాపం తెలియజేశారు. సీఐ ఆనంద రావు కుటుంబసభ్యులను పరామర్శించారు. సిఐ ఆత్మహత్య చేసుకోవడంతో తాడిపత్రి లో విషాద ఛాయలు అలుముకున్నాయి.