ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. మనీశ్‌ సిసోదియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ తిరస్కరణ

ఎనిమిది నెలలుగా జైలులోనే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి

Supreme Court rejects bail to Manish Sisodia in excise policy case

ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్‌ సిసోదియా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నగదు బదిలీకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తగిన ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. రూ.338 కోట్ల నగదు బదిలీ వ్యవహారం ముడిపడిన కేసు కావడంతో సిసోడియాకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, సిసోడియా గడిచిన ఎనిమిది నెలలుగా జైలులో ఉన్నాడు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారని, పాలసీని వ్యాపారులకు అనుకూలంగా తయారుచేశారని మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ పాలసీపై సర్వత్రా విమర్శలు రావడం, విషయం కోర్టుకు చేరడంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కారు దీనిని పక్కన పెట్టింది. అయితే, ఈ వ్యవహారంలో పెద్దమొత్తంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. విచారణ ప్రారంభించి ఒక్కొక్కరినీ అరెస్టు చేస్తూ వస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సిసోడియా జైలులోనే ఉన్నాడు. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న దరఖాస్తును కింది కోర్టులు కొట్టేయడంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. సిసోడియా బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.