సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ భేటీ

ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై చర్చించిన సంఘ్వీ
సీఎం జగన్ పై ప్రశంసలు


అమరావతి: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సంఘ్వీ నేడు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సంఘ్వీ… సీఎం జగన్ తో చర్చలు జరిపారు. అనంతరం సంఘ్వీ మాట్లాడుతూ..ఏపీ సీఎంతో సమావేశం కావడం పట్ల సంతోషిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి పట్ల ఆయన ఆలోచనలు బాగున్నాయని కితాబునిచ్చారు. రాష్ట్రంలో ప్రజల ఆదాయం పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రశంసించారు.

పరిశ్రమల సాయంతో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల పెంపు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి తనను ఆకట్టుకుందని సంఘ్వీ పేర్కొన్నారు. ఏపీలో అమలు చేస్తున్న స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలు భేషుగ్గా ఉన్నాయని, రాష్ట్రంలో సమగ్ర రీతిలో ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు తాము ఆసక్తిగా ఉన్నామని ప్రకటించారు. ఇక్కడే ఔషధాలు తయారు చేసి, ఇక్కడి నుంచే ఎగుమతి చేసేలా పరిశ్రమకు రూపకల్పన చేస్తున్నామని వివరించారు. ప్రాజెక్టును కార్యరూపంలోకి తెచ్చేందుకు ఏపీ అధికారులతో సంప్రదింపులు షురూ చేస్తామని చెప్పారు. సీఎం జగన్ వైఖరి ఏంటన్నది తెలుసుకునేందుకే ఇవాళ ఆయనతో భేటీ అయ్యానని, తమ మధ్య ఇదే తొలి సమావేశం అని దిలీప్ సంఘ్వీ వెల్లడించారు. సీఎం జగన్ సహకార ధోరణి సంతృప్తికరంగా అనిపించిందని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/