అత్యాచారాలకు పబ్ లు కారణం కాదంటున్న సోనూసూద్
రియల్ హీరో సోను సూద్ తాజాగా దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న అత్యాచారాల ఫై స్పందించారు. రీల్ లైఫ్ లో హీరో అనిపించుకుంటే..నిజ జీవితం లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్న వ్యక్తి సోనూసూద్. కరోనా సమయంలో సొంత డబ్బుతో ఎంతోమందిని కాపాడి..కనిపించే దేవుడయ్యాడు. ప్రస్తుతం ఎవరు ఆపదలో ఉన్న స్పందిస్తూ వారికీ సాయం చేస్తూ వస్తున్నాడు.
తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్ రేప్ కేసుపై సోనూసూద్ స్పందించారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగందనే విషయాన్ని న్యూస్ లో చూసి షాక్ కు గురయ్యానన్నారు. ఇలాంటి నేరాలకు పబ్ లు కారణమవుతున్నాయని అనడం సరైంది కాదని సోనుసూద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. మనం ఆలోచించే విధానంలోనే మార్పు రావాలన్నారు.
మహిళలు పొట్టి బట్టలు వేసుకున్నారని విమర్శిస్తున్నారని… మనం ఆలోచించే విధానం సరిగా లేనప్పుడు మనకు తప్పుడు ఆలోచనలే వస్తాయని చెప్పారు. ఇది చాలా పెద్ద నేరమని అన్నారు. అత్యాచారానికి పాల్పడింది మేజర్లా లేక మైనర్లా అనేది ముఖ్యం కాదని… వారు ఎలాంటి నేరం చేశారనేదే ముఖ్యమని చెప్పారు.
జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక అత్యాచార కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రొమేనియాకు చెందిన బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులోని నిందితుల్లో ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్ కొడుకు, వక్ఫ్‌బోర్డు చైర్మన్ కొడుకు, మాజీ ఎమ్మెల్యే మనవడితోపాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఇప్పటికే క్రైమ్‌సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.